ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలతో సరస్వతి పవర్ సంస్థలో అటవి శాఖ అధికారులు సర్వే చేయడం మొదలుపెట్టారు. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు శనివారం దాచేపల్లి, మాచవరం మండలంలోని సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములలో దాచేపల్లి డీఆర్వో ఆధ్వర్యంలో అటవి శాఖ అధికారులు, సిబ్బంది సర్వే చేస్తున్నారు.
సరస్వతి పవర్ సంస్థ భూముల వ్యవహారంలో సర్వే చెయ్యాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యావరణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీసీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అటవిశాఖ అధికారులు శనివారం రంగంలోకి దిగారు. సరస్వతి పవర్ సంస్థకు ఉన్న సుమారు 1,515 ఎకరాల భూముల్లో వాగులు, వంకలు, కొండ భూములు, ప్రకృతి సంపద భూములు ఏమైనా ఉన్నాయేమో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని పవన్ కల్యాణ్ అటవీశాఖ, పర్యావరణ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సరస్వతి పవర్ సంస్థ భూముల్లో ప్రకృతి సంపద, ప్రభుత్వ భూములు ఉన్నాయా అంటూ అటవీశాఖ అధికారుల క్షుణ్ణంగా సర్వే మొదలుపెట్టారు. సరస్వతి పవర్ సంస్థ భూముల్లో ప్రకృతి సంపద, వాగులు, వంకలు, కొండలు ఉంటే ఆ సంస్థకి పర్యావరణ శాఖ ఎలా అనుమతులు ఇచ్చింది, ఆ శాఖ అధికారుల మీద ఎవరైనా ఒత్తిడి తెచ్చారా ? అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరాలు సేకరిస్తుంది.
మొత్తం మీద సరస్వతి పవర్ సంస్థ భూముల్లో అటవీశాఖ అధికారులు సర్వే చేయడం హాట్ టాపిక్ అయింది. సరస్వతి పవర్ సంస్థ భూముల్లో ప్రకృతి సంపద, ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారు ? అనే విషయంలో చర్చ మొదలైయ్యింది. అటవి శాఖ అధికారులు నివేదిక ఎప్పుడు ఇస్తారా ? అంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.