ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన శాఖల పరిధిలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తూనే మరోవైపు తనకు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా మారడానికి అవకాశం ఇచ్చిన పిఠాపురం ఓటర్ల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
పిఠాపురంలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు
పిఠాపురం నియోజకవర్గ ప్రగతికి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి సారించి నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
వారికి పవన్ ఆదేశాలు
మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో 52 గ్రామాలు, రెండు మునిసిపాలిటీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆ ప్రత్యేక బృందాలకు ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్. అంతేకాదు పిఠాపురం నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం చేయవలసిన అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా అధ్యయనం చేయాలని వారికి సూచించారు.
పవన్ రాజకీయ ప్రస్తానం ఇలా
ఏపీలో జనసేన పార్టీ స్థాపించి రాజకీయాలు మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలో నిలదొక్కుకునేందుకు సుదీర్ఘ పోరాటమే చేశారు. తొలిసారి ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం లలో పోటీ చేసి రెండు చోట్ల ఓటమిపాలయ్యారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా జనసేన పార్టీ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే మినహాయించి మిగతా ఎవరు గెలవలేదు.
పిఠాపురం నుండి పవన్ కు పట్టం
గెలిచిన ఎమ్మెల్యే కూడా పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తూ వైసిపి భజన చేశారు.అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల పట్ల పోరాటానికి తన వంతుగా ముందుకు వచ్చి ముందుకు సాగారు. దీంతో గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు అత్యధిక మెజారిటీ ఇచ్చి ప్రజలు పట్టం కట్టారు.
పిఠాపురం ప్రజల కోసం పవన్ కీలక నిర్ణయం
ఒక్క పిఠాపురం నియోజకవర్గం లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగరవేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవడాన్ని ప్రతిష్టత్మకంగా భావించిన జనసేన అధినేత తనను ఓట్లేసి గెలిపించిన ప్రజలను మర్చిపోకుండా తన వంతుగా వారికి వెన్నుదన్నుగా నిలిచారు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకున్నారు.