కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. హత్యకు నిరసనగా, హాస్పిటల్స్ వద్ద సరైన భద్రత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనల బాట పట్టారు. ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యుల నిరసనలకు సంబంధించి ప్రతి 2 గంటలకు ఒక అన్ని రాష్ట్రాలు పరిస్థితిపై నివేదిక అందించాలని కోరింది.
కోల్‌కతా హత్యాచారం ఘటనకు నిరసనగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆందోళనలు, శాంతిభద్రతల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరింది. ఫ్యాక్స్ లేదా ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా కేంద్ర హోంశాఖ కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా కేంద్రం వివరాలు పంపించడం గమనార్హం.
ఇదిలావుంచితే.. వైద్యురాలిపై హత్యాచారం కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు మరోసారి రావాలంటూ ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆయనను విచారణకు పిలవడం ఇది మూడవ సారి. ఘోష్‌ను ఇదివరకే ఆగస్టు 16 (15 గంటలు), ఆగస్టు 17 (13 గంటలు) సీబీఐ ప్రశ్నించింది. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు మళ్లీ హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఘోష్‌పై సీబీఐ ఫోకస్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాగా హత్యాచారం జరిగిన తర్వాత ఘోష్ ప్రతిస్పందన ఏమిటి, విషాదానికి సంబంధించి ఆమె కుటుంబానికి, అధికారులకు ఎవరు తెలియజేశారు? ఎలా తెలియజేశారు?. వంటి విషయాలపై సీబీఐ దృష్టి సారించింది. ఇక ఘోష్‌తో పాటు ఈ ఘటనకు సంబంధించి వైద్యులు, పోలీసు అధికారులతో సహా 40 మందిని ప్రశ్నించాలని భావిస్తున్న సీబీఐ అధికారులు ఇప్పటికే 20 మంది వ్యక్తులను ప్రశ్నించారు.