అయిదేళ్లు సీఎంగా పనిచేసి పరాజయం పాలైతే లోపం ఎక్కడ ఉందో పోస్టుమార్టం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కష్టపడతారు ఎవరైనా.. అయితే మాజీ సీఎం జగన్ వ్యవహారతీరు మాత్రం ఆ పార్టీ వారికే అంతుపట్టడం లేదంట. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్లీణించిపోయాయని.. కూటమి పాలన కాదని రెడ్ బుక్ పాలన సాగుతుందని నానా హడావుడి చేస్తున్న జగన్ .. మళ్లీ బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. దాంతో ఆయన పరామర్శల కోసమే రాష్ట్రానికి వస్తున్నట్లు ఉందని వైసీపీ నేతలే గొణుక్కోవాల్సి వస్తుందిప్పుడు.
ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్ వైసీపీ వారికే అంతుపట్టకుండా తయారైందంట. ఓడిపోయాక ఏపీలో పనేముంది అన్నట్లు ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో గడపడానికి ఇష్ట పడుతున్నారు. ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చినా చిత్రమైన షెడ్యూల్ పాటిస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణించి పోతున్నాయని తెగ హైరానా పడుతున్న జగన్ .. ఒకసారి పోలింగ్ సమయంలో మాచర్లలో విధ్వంసం సృష్టించి అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలు కెళ్లి పరామర్శించి వచ్చి బెంగళూరులో మోజుపడి కట్టించుకున్న యలహంక ప్యాలెస్‌కు వెళ్లిపోయారు
తర్వాత పల్నాడు జిల్లా వినుకొండలో వక్తిగత కక్షలతో జరిగిన హత్యపై నానా రచ్చ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు హత్యకు గురవ్వడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో మారణకాండ జరిగిపోయిందని పెద్ద చిట్టా చదివారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నా చేసి తర్వాత గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసి మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు.
50 రోజుల్లో నాలుగో సారి బెంగళూరు వెళ్లి వచ్చిన ఆయన మళ్లీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈ సారి విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జగ్గయ్యపేటకు చెందిన ముగ్గురు వైసీపీ నాయకులను జగన్ పరామర్శించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబుపేట వాసులపై దాడి జరిగిందని తీవ్రగాయాలయ్యాయని వారి పరామర్శకు వెళ్లారాయాన. ఈ సారి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టకుండా దాడులు చేయిస్తున్నారని పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ ప్రభుత్వం వచ్చాక ప్రతిదాడులు చేసే తమ కార్యకర్తలను ఆపలేమని హెచ్చరిస్తున్నారు.
ఇక తాజాగా నంద్యాలకు పరామర్శ పేరుతో వెళ్లిన జగన్ మరోసారి రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కాదు రెడ్ బుక్ పాలన నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్‌లను నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు
అంతే ఇక అటు నుంచే ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుంచి బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లిపోయారు.. నాలుగైదు రోజులు ఆయన అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తమ్మీద రెండు నెలలు గడవకుండానే అయిదో సారి బెంగళూరు వెళ్లిపోయారాయన.