దేశంలో 2013 నాటి వక్ఫ్ చట్టాన్ని సవరించడం ద్వారా దేశంలో వక్ఫ్ బోర్డుల నియంత్రణకు ప్రయతిస్తున్న కేంద్రానికి ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును ఇవాళ మైనార్టీ మంత్రి కిరణ్ రిజిజు లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీన్ని ఇండియా కూటమి ముక్తకంఠంతో వ్యతిరేకించింది. మైనార్టీల హక్కుల్ని కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడింది. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది.
కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన విపక్ష ఇండియా కూటమి ఎంపీలు.. దీనిని “క్రూరమైనది”, మతపరమైన “దేశాన్ని విభజించే ప్రయత్నం” అని ఆరోపించాయి. ఇది రాజ్యాంగంపై పద్ధతి ప్రకారం చేస్తున్న దాడి అని విమర్శించాయి. దేశంలో మతాల మధ్య ద్వేషాన్ని, విభజనను తెచ్చే ప్రయత్నమన్నాయి. మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లు తెస్తున్నారని విపక్ష ఎంపీలు మండిపడ్డారు. మైనార్టీలను టార్గెట్ చేసేలా ఉన్న ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
దీనిపై స్పందించిన మంత్రి కిరణ్ రిజిజు.. ఏ మత సంస్థ స్వేచ్ఛలో జోక్యాన్ని ఈ బిల్లు సమర్థించదని అన్నారు. ఎన్నడూ పొందని వారికి హక్కులు ఇవ్వడానికి ఈ బిల్లు తీసుకొచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ వేసిన సచార్ కమిటీ నివేదిక ఆధారంగానే ఇవాళ తెచ్చిన ఈ బిల్లు పక్షపాత రాజకీయాల వల్ల ముస్లింలు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. వక్ఫ్ బోర్డును మాఫియా కబ్జా చేసిందని, ప్రభుత్వానికి వందకు పైగా భూకబ్జా ఫిర్యాదులు వచ్చాయని రిజిజు చెప్పారు. చివరికి విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయించింది.