దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో ఐదు దశల పోలింగ్ పూర్తయింది. మరో రెండు దశల పోలింగ్ పూర్తయితే మొత్తం సార్వత్రిక ఎన్నికలు ముగుస్తాయి. ఈ తరుణంలో దశల వారీగా పోలింగ్ పూర్తయిన 48 గంటల్లో ఓటింగ్ శాతాన్ని బూత్ ల వారీగా బయటపెట్టాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోపు కాకుండా ఎప్పుడో ఈసీ ఈ వివరాలు ఇవ్వడం, అందులోనూ పోలింగ్ శాతాలు తేడా ఉండటంతో అనుమానాలు మరింత పెరిగాయి.
ఇదే అంశంపై అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోలింగ్ పూర్తయిన 48 గంటల్లోగా ఈసీ ఫామ్ 17సీ డేటాను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏడీఆర్ కోరింది. అయితే దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ వినతిని తోసిపుచ్చింది. ఆ మేరకు ఈసీకి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పేసింది. ప్రస్తుతానికి ఐదు దశల పోలింగ్ మాత్రమే జరిగిందని, మరో రెండు దశల పోలింగ్ జరగాల్సిన నేపథ్యంలో పోలింగ్ పూర్తి వివరాలు బయటపెట్టమని కోరలేమని తెలిపింది.
ఏడీఆర్ పిటిషన్ పై ఈసీకి తొలుత సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో స్పందించిన ఈసీ.. దశల వారీగా జరుగుతున్న పోలింగ్ మధ్యలో బూత్ ల వారీగా వివరాలు అందిస్తే ఓటర్లలో గందరగోళానికి దారి తీస్తుందని వాదించింది. కాబట్టి పూర్తిగా ఎన్నికలు ముగిశాక మాత్రమే ఈ డేటా ఇస్తామని తెలిపింది. ఈ వాదనకు అంగీకరించిన సుప్రీంకోర్టు వేసవి సెలవుల వెకేషన్ బెంచ్ ఏడీఆర్ పిటిషన్ ను తోసిపుచ్చింది. మరోవైపు ఈసీ అఫిడవిట్ పై సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఎలా నమ్మాలని ప్రశ్నించారు.