UPDATES  

NEWS

 పిఠాపురంలో భారీగా మద్యం సీజ్..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున అక్రమ మద్యం పట్టుబడింది. పోలీసులు జరిపిన తనిఖీల్లో నాలుగు ప్రాంతాల్లో అక్రమ మద్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. పట్టణంలోని జగ్గయ్యచెరువు, సాలిపేట, వైఎస్‌ఆర్‌ గార్డెన్‌, కుమారపురం కాలనీల్లోని ఇళ్లలో నిల్వ చేసిన రూ.80 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

 

ఒక ఇంట్లోనే 2,560 లీటర్లకు పైగా మద్యం లభ్యమైంది. వేల కొద్దీ రాయల్‌ బ్లూ బ్రాండ్‌, గోవా కిక్‌ మద్యం సీసాలు నిల్వ చేసినట్టు అధికారులు తెలిపారు. ఎస్‌ఈబీ అధికారి మహబూబ్‌ అలీ ఆధ్వర్యంలో ఇంకా సోదాలు జరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటంతో పిఠాపురం నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో ఎన్డీయే కూటమి, వైసీపీ మధ్య గట్టిపోటీ నెలకొంది. వైసీపీ నేతలు పెద్ద ఎత్తున మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

 

 

ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్‌ కళ్యాణ్‌ను ఓడించేందుకు నాలుగైదు లారీల మద్యం దించారని పిఠాపురం టీడీపీ ఇం‌ఛార్జి వర్మ ఆరోపించారు. పట్టణంలో భారీగా మద్యం పట్టుబడటంపై ఆయన స్పందించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి పిఠాపురంలో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పవన్‌ను ఓడించేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని విమర్శించారు.

 

ఇది ఇలావుండగా, కాకినాడలో భారీగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్ఈబీ అధికారులు పట్టుకున్నారు. ఇంద్రపాలెం అంబేడ్కర్ కూడలి సమీపంలో మద్యం తరలిస్తున్న టాటా ఏసీ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలుల రూ.21 లక్షలు ఉంటుందని సెబ్ సూపరింటెండెంట్ రవికుమార్ వెల్లడించారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |