ఏపీలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన రఘురామ కృష్ణంరాజు ఆరు నెలల్లోనే సీఎం జగన్ తో విభేదించి పార్టీకి దూరమయ్యారు. అంతటితో ఆగకుండా జగన్ ను నేరుగా టార్గెట్ చేసి నాలుగేళ్లపాటు నరసాపురం నియోజకవర్గంతో పాటు ఏపీకి దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల వేళ బీజేపీ టికెట్ ఆశించినా దక్కకపోవడంతో ఓ దశలో రాజకీయాలకు గుడ్ బై చెప్పేయాలని భావించిన రఘురామకు చివరి నిమిషంలో ఆయన వైసీపీపై చేసిన పోరాటమే కలిసొచ్చింది. దీంతో ఇవాళ ఆయన టీడీపీలో చేరారు.
పాలకొల్లులో చంద్రబాబు ప్రజాగళం యాత్రలో రఘురామరాజు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. చంద్రబాబు బహిరంగ సభలోనే నేరుగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా రఘురామ నాలుగేళ్లుగా చేసిన పోరాటం, ఆయన్ను జగన్ టార్గెట్ చేసిన తీరును చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అనంతరం టీడీపీలో చేరడం సంతోషంగా ఉందని రఘురామ తెలిపారు. జూన్ 4న గెలిచేది ఎన్డీయే కూటమేనని రఘురామ జోస్యం చెప్పారు.
బీజేపీలో నరసాపురం ఎంపీ టికెట్ ఆశించినా రఘురామకు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరిన ఆయనకు నరసాపురం సీటు ఇచ్చి కావాలంటే ఏలూరు ఎంపీ స్ధానం తీసుకోమని బీజేపని చంద్రబాబు కోరుతున్నారు. ఇందుకు బీజేపీ అంగీకరిస్తే సరి లేకపోతే ఆయన కోసం తమ సిట్టింగ్ ఎమ్మెల్యే స్ధానం ఉండిని కేటాయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను కేంద్రానికి వెళ్లాలని కోరరుకుంటున్నానని, కానీ ప్రజలు మాత్రం తనను రాష్ట్రంలోనే ఉండి అసెంబ్లీ స్పీకర్ పదవిలో చూడాలని కోరుకుంటున్నారని తాజాగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు.









