UPDATES  

NEWS

 వాటర్ ట్యాంకులో పడి 30 కోతులు మృతి.. అవే నీళ్లు తాగిన జనం..

అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు ప్రజల ఆరోగ్యానికి చేటు తెచ్చేలా మారింది. వివరాల్లోకి వెళితే.. తాగునీటి వాటర్ ట్యాంకులో పడి దాదాపు 30-40 కోతులు మృతి చెందాయి. ఈ ఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీలో ఆలస్యంగా వెలుగుచూసింది. విజయవిహార్ సమీపంలోని 200 గృహాలకు తాగునీరు సరఫరా చేసేందుకు నీటి సరఫరా విభాగం ఓ ట్యాంకు నిర్మించి పైన రేకులు వేశారు.

 

అయితే, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్యాంకులోని నీళ్లు తాగేందుకు కోతులు ప్రయత్నించాయి. ఈ క్రమంలోనే ట్యాంకులోకి దిగిన వానరాలకు బయటకు వచ్చే దారి దొరక్క.. అందులోనే మృతి చెందాయి. అయితే, ఆలస్యంగా మేలుకొన్న అధికారులు దాదాపు 30 కోతుల మృతదేహాలను గుర్తించి బయటకి తీశారు.

 

కాగా, తాగునీటి ట్యాంకులో కోతులు మృతి చెందిన విషయం వెలుగు చూడటంతో స్థానికంగా నివసించే ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కోతులు చనిపోయి దాదాపు పది రోజులపైనే అయిఉంటుందని, అప్పట్నుంచి ఆ నీటినే తాగుతున్నామని చెబుతున్నారు. అనారోగ్యం బారిన పడతామని భయాందోళనలకు గురవుతున్నారు.

 

కాలనీలోని నివాసగృహాలకు నీటిని సరఫరా చేసే ట్యాంకులను తరచూ చేయాల్సి ఉండగా.. అధికారులు మాత్రం ఏనాడూ శుభ్రం చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యం వహించి ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన నీటి సరఫరా విభాగం అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |