పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఓ వినూత్న దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ పోలింగ్ కేంద్రంలో ‘నీల’ అనే హ్యూమనాయిడ్ రోబో, సంప్రదాయ చీరకట్టులో ఓటర్లకు స్వాగతం పలుకుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజాస్వామ్య పండుగకు సాంకేతికతను జోడించి ఎన్నికల సంఘం చేసిన ఈ ప్రయోగంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ మోడల్ పోలింగ్ కేంద్రం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కేంద్రానికి వచ్చే ఓటర్లకు ‘నీల’ రోబో చేతులు జోడించి నమస్కరిస్తోంది. ‘ఓటు వేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అంటూ సందేశం ఇస్తూ వారిలో ఉత్సాహం నింపుతోంది. ఈ అనూహ్య పరిణామానికి ఓటర్లు, ముఖ్యంగా యువత ఆశ్చర్యపోయారు. చాలామంది ‘నీల’ రోబోతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు.
ఓటింగ్ శాతాన్ని పెంచడంతో పాటు, ఓటర్లలో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఈ సరికొత్త ఆలోచనను అమలు చేసింది. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు.








