UPDATES  

NEWS

 నాదర్‌గూల్ భూముల వ్యవహారంపై హరీశ్ రావుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కౌంటర్..

నాదర్‌గుల్‌లో భూములను 2014లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు సంస్థలకు అప్పగించిందని, వారి హయాంలోనే ఆ సంస్థల పేరిట రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కూడా జరిగిందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. నాడు జరిగిన రిజిస్ట్రేషన్‌తో తమ ప్రభుత్వానికేం సంబంధమని మండిపడ్డారు. నాదర్‌గుల్ భూములను తమ ప్రభుత్వం హయాంలో కట్టబెట్టినట్లు ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు.

 

హరీశ్ రావు చెబుతోన్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు. తమకు నాలా కన్వర్షన్ ఇవ్వలేదని భూములు పొందినవారు 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే, నాటి కేసీఆర్ ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ భూములు ప్రభుత్వానివేనని కౌంటర్ దాఖలు చేశామని వెల్లడించారు.

 

నాడు వాటాల కోసం భూములు కట్టబెట్టిన వారు ఇప్పుడు తమపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీశ్ రావు చెబుతున్న కంపెనీల్లో తన కుటుంబ సభ్యులు ఎవరూ లేరని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. నాదర్‌గుల్ భూముల వ్యవహారానికి సంబంధించిన కంపెనీల్లో తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు.

 

కాగా, నాదర్‌గూల్ భూముల వ్యవహారంపై ఇటీవల రాజకీయ దుమారం చెలరేగుతోంది. రూ.7 వేల కోట్ల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టిందని హరీశ్ రావు ఆరోపిస్తున్నారు. అయితే ఈ భూమి యజమాని ఏక్యూ రియాల్టర్ అని చెబుతున్నారు. ఇది ప్రైవేటు భూమి అని హైకోర్టు, సుప్రీంకోర్టు గుర్తించాయని ఏక్యూ రియాల్టర్ అడ్వకేట్ ఇటీవల తెలిపారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |