జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ అభ్యర్దులను అప్రమత్తం చేసారు. ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పవన్ తన పార్టీ అభ్యర్దులను బి ఫారాలు అందించారు. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ రెండు ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అభ్యర్దులు సిద్దమవుతున్నారు. కూటమిలోని ఇతర పార్టీల నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు.
బీ ఫారాల పంపిణీ జనసేన రెండు ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి బరిలో ఉన్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం కొనసాగిస్తున్నారు. పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్దులకు పవన్ బీ ఫారాలు అందించారు. తొలి ఫారంను జనసేన కీలక నేత నాదేండ్ల మనోహర్, లోకం మాధవికి పవన్ అందజేశారు. తనతో సహా 20 మంది ఎమ్మెల్యే, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బి ఫారాలను పవన్ ఇచ్చారు. పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు. అభ్యర్దులు నామినేషన్ల దాఖలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవన్ సూచించారు. నియోజకర్గాల్లో ప్రచారం పెంచాలని..మిత్రపక్షాలను కలుపుకు వెళ్లాలని నిర్దేశించారు.
కీలక సూచనలు ఈ ఎన్నికలు కీలకమైనవని చెప్పిన మనోహర్…ప్రతిఒక్కరూ క్షేత్ర స్థాయిలో పర్యటనలు, ప్రచారం చేయాలన్నారు. ఈ ఐదేళ్లల్లో జరిగిన దాడులు, దారుణాలు ప్రజలకు వివరించాలన్నారు. పవన్ కల్యాణ్ మనపై నమ్మకంతో అవకాశం కల్పించారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ప్రజలకు మనమేం చేస్తామో, ఏమి చేయగలమో వివరించాలన్నారు. బీజేపీ, టీడీపీ నేతలను కలుపుకుని విజయమే లక్ష్యంగా అడుగులు వేయాలన్నారు. తప్పకుండా నవ శకానికి నాందీ పలికేలా అందరూ కలిసి పని చేయాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
పవన్ నామినేషన్ పవన్ కల్యాణ్ అభ్యర్దులు పోటీ చేస్తున్న నియోజవర్గాల్లో ప్రచారం కోసం షెడ్యూల్ సిద్దమవుతోంది. ఈ నెల 22న పిఠాపురంలో పవన్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ ముఖ్యనేతలు వచ్చే నెల తొలి వారంలో ఏపీలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ప్రధాని మోడీ రెండు సభల్లో పాల్గొంటారని సమాచారం. అదే విధంగా అమిత్ షా, నడ్డాతో కలిసి చంద్రబాబు – పవన్ తమ ఎన్నికల ప్రచారం కొనసాగించనున్నారు. మేనిఫెస్టో పైన కసరత్తు కొనసాగుతోంది.