ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ డబ్బు ముట్టజెప్పాలని చూసింది. ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌సన్ ఇంటికి డబ్బు సంచులతో వెళ్లి.. ఏసీబీ అధికారులకు దొరికిపోయారు.
అందులోనూ ఫుటేజీలో నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి స్పష్టంగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఓ ఆడియో కూడా విపరీంగా వైరల్ అయింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఈ కేసు మరుగున పడింది. ఇటీవలే ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.
కేసు విచారణను బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ప్రతివాదులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో మరోసారి ఓటుకు నోటు కేసుకు సంబంధించి ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో అప్పట్లో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, 2017లో కేసును ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని, చంద్రబాబును కేసులో ముద్దాయిగా చేర్చాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల సమయంలో మరోసారి ఓటుకు నోటు కేసు మరోసారి తెర మీదకు రావడంతో టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు. ఇటీవలే బెయిల్ షరతులను ఉల్లంఘించొద్దంటూ హైకోర్టు చంద్రబాబుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇటువంటి తరుణంలో ఓటుకు నోటు కేసు మరోసారి విచారణకు రానుండటం పార్టీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అని పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.