శ్రీరామనవమి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ పర్వదినం వైభవంగా జరుపుకొంటోన్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. ఏపీలో కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. తెలంగాణలో భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణం కొనసాగింది.
అటు ఉత్తరప్రదేశ్ అయోధ్య రామమందిరానికి భక్తులు పోటెత్తారు. శ్రీరామనవమి నాడు రామ్ లల్లాను దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు బారులు తీరారు. తెల్లవారు జామున 4 గంటల నుంచే ఆలయం వద్ద రద్దీ నెలకొంది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలి రామనవమి ఇదే కావడం వల్ల దేశం నలుమూలల నుంచీ భక్తులు అయోధ్యకు చేరుకున్నారు.
Ram Navami 2024 Surya Tilak illuminates Ram Lalla s forehead at the Ayodhya Ram Mandir
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యభగవానుడి కిరణాలు బాల రాముడి విగ్రహం నుదుటిని తాకాయి. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు సూర్యకిరణాలు విగ్రహం నుదుటిని స్పృశించాయి. ఈ కార్యక్రమానికి సూర్య తిలక్ అని పేరు పెట్టారు.
మూడు నుంచి మూడున్నర నిమిషాల పాటు సూర్యకిరణాల వెలుగులో బాలరాముడు భక్తులకు దర్శనం ఇచ్చాడు. ఆ సమయంలో రామమందిరం గర్భగుడిలో విద్యుద్దీపాలన్నింటినీ ఆర్పివేశారు. సూర్యకిరణాలు, హారతి వెలుగులో మెరిసిపోయాడు అత్యంత రమణీయంగా కనిపించాడు.
58 ఎంఎం డయామీటర్ల మేర విస్తీర్ణం గల లెన్సులను అమర్చారు. వాటి మీద సూర్యకిరణాలు పడి.. అవి విగ్రహం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. దీనికోసం రూర్కీలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్- సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టుల సహకారాన్ని తీసుకుంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.
దీనికోసం శక్తిమంతమైన అద్దాలు, లెన్సులను ఉపయోగించింది. ఈ వైభవాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం భక్తులకు కలిగింది. భక్తులు దీన్ని తిలకించడానికి ఆలయం పరిసరాలు, అయోధ్యలో మొత్తం 100 ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చారు.