తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి సమీపంలో క్షుద్రపూజల కలకలం రేగింది. క్షుద్రపూజలు జరిగినట్లు ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న కేసీఆర్ ఇంటిపక్కన గల ఖాళీస్థలంలో క్షుద్రపూజలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టీమ్.. ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించింది. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా క్షుద్రపూజలు చేసిందెవరో దర్యాప్తు చేస్తోంది.
క్షుద్రపూజలు ఎవరు చేశారు ? ఎప్పుడు చేశారు ? ఎవరు చేయించారు ? ఎవరి కోసం చేశారు ? నిత్యం సెక్యూరిటీ ఉండే.. కేసీఆర్ ఇంటిపక్కనే.. అందులోనూ హైదరాబాద్ లో క్షుద్రపూజలు చేయడం ఎలా సాధ్యమైంది ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏదైమైనా కేసీఆర్ ఇంటికి సమీపంలో క్షుద్రపూజలు జరగడం కలకలం రేపింది. క్షుద్రపూజల ఆనవాళ్లు చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.