మరి కొన్ని రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కిరాయి మూకలు తనని, తన సెక్యూరిటీని సన్న బ్లేడ్ లతో కోస్తున్నారని వెల్లడించారు.
పిఠాపురంలో పలువురు జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనని కలవడానికి ఒకేసారి ఎక్కువ మంది వచ్చినప్పుడు.. అందులో ఉన్న కిరాయి మూకలు సన్న బ్లేడ్ లతో వచ్చి తనని, తన సెక్యూరిటీని కోస్తున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
‘మన ప్రత్యర్థి సంగతి తెలుసు కదా..? ఫోటోల కోసం మూకుమ్మడిగా అభిమానులు వచ్చినప్పుడు కొన్ని ప్రోటోకాల్ పద్ధతులు పాటిద్దాం. అందరితో ఫొటోలు దిగాలని నాకు ఉంది. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కిరితో ఫొటోలు దిగుతా. అందుకే పిఠాపురాన్ని నా స్వస్థలంగా మార్చుకున్నా.. ప్రతిరోజు 200 మందిని కలిసే అవకాశం కల్పిస్తా’ అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
జనసైనికుల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నా మీదనే మన ప్రత్యర్థులు దాడి చేస్తున్నారంటే మీరు మరింత జాగ్రత్తగా ఉండాలని పవన్ తన కార్యకర్తలకు హెచ్చరించారు. సోమవారం పలు పార్టీకి చెందిన వ్యక్తులు మూకుమ్మడిగా జనసేనలో చేరిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.