ఏపీలో పింఛన్ల పంపిణీపై రాజకీయ రగడ రేగింది. మార్చి వరకు ప్రతి నెలా ఒకటో తేదిన వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసేవారు. కానీ వాలంటీర్లను పింఛన్ల పంపిణీ బాధ్యతల నుంచి తప్పించడంతో వివాదం రాజుకుంది. ఏప్రిల్ 1న లబ్ధిదారులకు పింఛన్ల అందలేదు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుపై ఈ నెపాన్ని నెట్టడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
పింఛన్ల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య గుర్తుచేశారు. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. లబ్ధిదారులకు త్వరగా ఫించన్లు అందించాలన్నారు. ఏప్రిల్ 5న లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ తీరుపై వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఉద్దేశపూర్వకంగానే పింఛన్ల పంపిణీ ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. గతంలో మాదిరిగానే ఇంటి వద్దే లబ్ధిదారులకు నగదు అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో లబ్ధిదారులకు ఇబ్బందులు సృష్టించి ఈ నెపాన్ని చంద్రబాబుపై నెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లబ్ధిదారులకు పింఛన్లు ఇంటికి వెళ్లి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాలని కోరారు.
చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని కనకమేడల విమర్శించారు. సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఖజానాలోని సంక్షేమ పథకాలకు నిధులు లేవన్నారు. ఈ అంశంపై విచారణ జరపాలన్నారు.
పింఛన్లు పంపిణీ వివాదంపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ మాట్లాడానని తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఫింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారన్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ .. డీబీటీ ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు. లబ్ధిదారులకు సకాలంలో ఫించన్ల ఇవ్వకుంటే ఆందోళనలు చేస్తామని షర్మిల వార్నింగ్ ఇచ్చారు