ఏపీలో కొత్తగా ఆరు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఇవాళ మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ఈ ఆరు ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం ప్రతిపాదిత స్థలాల్ని గుర్తించిన ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం, వాటికి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం, వాటి ఆధారంగా ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తదుపరి అధ్యయనం కోసం సిద్ధం కావడం జరిగిపోయాయి. ఇప్పుడు ఈ అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.27 కోట్ల నిధులు విడుదల చేస్తోంది.
రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని , అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఎయిర్ పోర్టు ఆధారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 9 అంశాలపై అధ్యయనం జరగనుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రతిపాదిత ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో ఎయిర్ కనెక్టివిటీని, కార్గో సేవలను పెంచడం, ప్రయాణీకులకు మరింత విస్తృతంగా సేవలు అందించాలన్న ఆలోచన సాకారం అవుతుందన్నారు.. ఇందులో భాగంగా రాష్ట్రంలోని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధి సాధ్యాసాధ్యాలపై ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. దీంతో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదిత ఎయిర్ పోర్టుల అభివృద్ధికి తగిన భూమి గుర్తించి, నివేదికలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని తెలిపారు.
ఇందుకోసం కుప్పంలో 1501 ఎకరాలు, నాగార్జున సాగర్ – 1670 ఎకరాలు, తాడేపల్లి గూడెం – 1123 ఎకరాలు, శ్రీకాకుళం – 1383 ఎకరాలు, తుని – అన్నవరం – 787 ఎకరాలు, ఒంగోలు – 657 ఎకరాలు ఎయిర్ పోర్టు అభివృద్ధికి తగిన భూమి అందుబాటులో ఉన్నట్లు కలెకర్ట్ ల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదికను అందింది. ఈ భూముల్లో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై ముందస్తు అధ్యయనానికి ప్రాథమికంగా 9 అంశాలకు సంబంధించి, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీ అధ్యయనం చేయనుంది.
ఈ అధ్యయనంలో 9 అంశాలు (ప్రతిపాదిత భూమిలో WGS- 84 వ్యవస్థ, రెవెన్యూ మ్యాప్, ప్రతిపాదిత భూమి లైన్ డైయాగ్రమ్ స్కెచ్, ప్రతిపాదిత భూమి విండోర్స్ డయాగ్రమ్, కాంటూర్ మ్యాప్, ప్రతిపాదిత సైట్ లో ప్లాన్ చేయబడిన క్రిటికల్ ఎయిర్ క్రాప్ట్ టైప్, 1:50000 లో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్, గత 10 ఏళ్లలో మెటలార్జికల్ డిపార్ట్ మెంట్ డేటా, టైప్ ఆఫ్ ఆఫరేషన్స్ డిసైర్డ్ – (VFR) or (IFR) ) ప్రతిపాదిత ఎయిర్ పోర్టు ప్రాంత అభివృద్ధికి సంబంధించిన భూమిలో అధ్యయనం చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో ఎయిర్ పోర్టుకు రూ. 37.87 లక్షల చొప్పున రూ.2.27 కోట్లు విడుదల చేస్తున్నారు.
ఈ నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ఒక నిర్ణయానికి రానుంది. అటు ఇప్పటికే నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్ పోర్టుకు సంబంధించి, ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తగిన భూమి కోసం అధ్యయనం చేసి కేంద్రానికి నివేదికలు ఇచ్చింది. దీంతో కలిపి మొత్తం 7 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు రాబోతున్నాయి.