టెక్ యుగంలో ట్రెండ్ మారింది.. వివాహం జరిగితే ఒక సమస్య.. జరగపోతే మరొక సమస్య. దేశంలో అమ్మాయిల దొరక్క పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య పెరుగుతోంది. వివాహం చేసుకున్నవారి పరిస్థితి ఏంటి? వారి జీవిత దాంపత్యం ఎలా ఉంది? దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వివాహేతర డేటింగ్ యాప్.. 40 లక్షల మంది భారతీయులు
మారుతున్న జీవనశైలి వల్ల జీవిత భాగస్వామికి తెలియకుండా సీక్రెట్ డేటింగ్ కోసం వెతుకుతున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇందుకు వివాహేతర డేటింగ్ యాప్ వేదికగా మారింది. ఈ యాప్‌లో ఏకంగా 40 లక్షలకు పైగా భారతీయులు ఉన్నట్లు తాజా లెక్క. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. గ్లీడెన్ తాజా డేటా నివేదిక కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ యాప్‌లో 65 శాతం పురుషులు ఉన్నారు.
35 శాతం మంది మహిళలు కూడా ఉన్నారు. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. గత రెండేళ్లలో మహిళల భాగస్వామ్యం 148 శాతం పెరిగింది. అధికశాతం మంది వివాహితులు ఉన్నట్లు తేలింది. మహిళలు తాము తీసుకునే నిర్ణయాల్లో స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తున్నారనే దానికి ఈ వృద్ధి సూచిస్తోందని ఆ సంస్థ మేనేజర్ తెలిపారు. మహిళలు తమ ఎంపికలను ధైర్యంగా ఎంచుకుంటున్నారని తేల్చింది. భారతీయులు తమ మొబైల్‌పై రోజుకు గంట నుంచి గంటన్నర వరకు చాటింగ్ చేస్తారని తేల్చింది.
బెంగుళూరు తర్వాత హైదరాబాద్.. టైర్ 2 సిటీల్లో కూడా
మధ్యాహ్నం 12- 3 గంటలు, మళ్లీ రాత్రి 10 నుండి అర్ధరాత్రి మధ్య అత్యధికంగా ఉన్నట్లు తేలింది. ఇక రహస్యంగా డేటింగ్ చేసేవారిలో అత్యధికంగా బెంగళూరు సిటీ వాసులు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉంది. మొత్తం యూజర్లలో 18 శాతం మంది బెంగుళూరు కాగా, 17 శాతంతో హైదరాబాద్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఢిల్లీ 11 శాతం కాగా, దాని తర్వాత ముంబై 9 శాతం, పూణె 7శాతంతో నిలిచాయి. ఈ ధోరణి కేవలం మెట్రో సిటీలకు పరిమితం కాలేదు. టైర్-2 నగరాలకు క్రమంగా విస్తరిస్తోంది. లక్నో, పాట్నా, భువనేశ్వర్, సూరత్, చండీగఢ్, గౌహతి వంటి నగరాలకు పెరుగుతున్నట్లు తెలిపింది.
సాధారణంగా పురుషులు 25 నుంచి 30 ఏళ్ల వయసు గల మహిళలను కోరుకుంటారు. మహిళలు 30 నుంచి 40 ఏళ్ల వయస్సు గల పురుషుల కోసం ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. మహిళలు ఎక్కువగా డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఆర్థికంగా స్థిరపడిన ప్రొఫెషనల్స్‌ను ఇష్టపడుతున్నారని తెలిపింది. ఈ సంస్థ నివేదికపై పలు ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
పెరుగుదల సాధికారతకు సూచినా? ప్రస్తుత సంబంధాలలో తీరని భావోద్వేగ అవసరాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆధునిక సంబంధాల పట్ల ప్రజల దృక్పథంలో ఒక నిశ్శబ్ద విప్లవానికి నిదర్శనమని ఆ సంస్థ చెబుతోంది. దేశంలో చాలా మంది వివాహాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కానీ భావోద్వేగాలను వ్యక్త పరచడానికి, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికి ఇలాంటి మార్గాలను ఉపయోగించుకుంటున్నారని తెలిపింది.








