ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి శుభవార్తను వినిపించింది. ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ పథకం కింద ఉన్నత విద్యాసంస్థల్లో చేరిన విద్యార్థులకు ఎలాంటి పూచీకత్తు గానీ, గ్యారంటీ గానీ లేకుండా రుణాలు పొందే వీలును కల్పించింది. పీఎం- విద్యాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి 1,00,000 మంది విద్యార్థులు తమ ఉన్నత స్థాయి చదువుల కోసం రుణాలను పొందవచ్చు.
వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల వరకు ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ పీఎం- విద్యాలక్ష్మి పథకం కింద మూడు శాతం వడ్డీ రాయితీతో 10 లక్షల రూపాయల వరకు రుణాలపై తీసుకోవచ్చు. వార్షిక ఆదాయం నాలుగున్నర లక్షల రూపాయల వరకు కుటుంబాలకు చెందన విద్యార్థులకు పూర్తి వడ్డీ రాయితీ లభిస్తుంది.
దీనితోపాటు- ఏడున్నర లక్షల రూపాయల వరకు విద్యార్థులు తీసుకున్న రుణాల విషయంలో బకాయిలు ఏవైనా ఉంటే వాటిని తీర్చడానికి 75 శాతం బ్యాలెన్స్ మొత్తాన్ని కవర్ చేసే క్రెడిట్ గ్యారెంటీ వెసలుబాటును కూడా ఈ పథకంలో అందుబాటులో తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.
అర్హులైన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి, రుణం కోసం దరఖాస్తులను దాఖలు చేయడానికి, వడ్డీ మొత్తాన్ని చెల్లించడానికీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పీఎం-విద్యాలక్ష్మి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రుణాల మంజూరు ప్రక్రియ మొత్తం కూడా ఈ పోర్టల్ ద్వారానే కొనసాగుతుంది.
పీఎం- విద్యా లక్ష్మి పథకాన్ని అమలు చేయడానికి దేశవ్యాప్తంగా గల అనేక విద్యాసంస్థలను కేంద్ర ప్రభుత్వం వడపోయాల్సి ఉంది. దీనికి సంబంధించిన జాబితాను నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ రూపొందిస్తుంద. ఇందులో వివిధ కేటగిరీలలో ర్యాంకులు పొందిన టాప్ 100 సంస్థలు, రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రభుత్వాలకు చెందిన టాప్ 200 కళాశాలలు ఉంటాయి.
ఉన్నత స్థాయి చదువులు చదవాలని భావించినప్పటికీ దానికి అనుగుణంగా ఆర్థిక స్థోమత లేని విద్యార్థులకు ఈ విద్యాలక్ష్మి పథకం ఓ వరంగా మారుతుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన తీర్మానాల గురించి వివరించారు.