దైవభూమిగా చెప్పుకునే కేరళపై ప్రకృతి పగబట్టింది. కొన్నిసంవత్సరాలుగా.. వర్షాకాలంలో ఎన్నడూ లేనివిధంగా వరదలు రావడం, పదుల సంఖ్యలో ప్రజలు మరణించడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. 2018లో సంభవించిన భారీ వరదలను ఇప్పటికీ మరచిపోలేం. ఆ వరదల్లో 483 మంది మరణించారు. ఎంతో ప్రశాంతంగా, మనసుకు హాయినిచ్చే అందమైన ప్రకృతితో ఉండే కేరళపై.. ఇప్పుడా ప్రకృతే ప్రకోపం చూపుతోంది.
కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి బీభత్సం సృస్టించింది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో వందకు పైగా ప్రజలు చనిపోయారు. ఇళ్లు ధ్వంసమై నిరాశ్రయులయ్యారు. మరికొందరికి కాళ్లు, చేతులు విరిగిపోయి ఆస్పత్రుల పాలయ్యారు. కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో ఆందోళనలో పలువురు కంటిపై కునుకు లేకుండా జీవిస్తున్నారు.
మెప్పడి, మండక్కై, చూరాల్‌మల, అట్టామల, నూల్‌పుజా గ్రామాల్లో భారీ వర్షాలు కురిసాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఆయా గ్రామాలు ఆనవాళ్లే లేకుండా తుడిచిపెట్టుకు పోయాయి. వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది మంది బురద మట్టిలో కూరుకుపోయారు. వారిలో ఇప్పటివరకూ 143 మంది మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. గాయపడిన మరో 128 మందిని ఆసుపత్రులకు తరలించారు. మరో 98 మంది ఆచూకీ తెలియడం లేదు.
మరోవైపు ఈ గ్రామాల్లోని టీ, కాఫీ తోటల్లో పనిచేసే 600 మందికి పైగా వలస కూలీల ఆచూకీ దొరకడం లేదు. అనేక మంది శిథిలాల కింద చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. సైన్యం, NDRF సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలలో చిక్కుకున్నవారిని సహాయక బృందాలు తాళ్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో.. మట్టిలో కూరుకుపోయి ఇంకా ఆచూకీ తెలియనివారికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతాల నుంచి సుమారు 3 వేల మందిని ప్రత్యేక శిబిరాలకు తరలించి.. వారికి కావలసిన ఆహారం, మంచినీటిని అందిస్తున్నారు అధికారులు.
కేరళలో దాదాపు ప్రతీ ఏటా భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలు సర్వసాధారణంగా మారాయి. ఈ ఘటనలతో పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. 2018లో సంభవించిన విధ్వంసక వరదల్లో రికార్డు స్థాయిలో 483 మంది మరణించారు. ఈ విపత్తులకు నిపుణులు పలు కారణాలను చెబుతున్నారు. కేరళలో భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని, రాష్ట్రంలోని 14.5% భూభాగం అందుకు అనుకూలంగా ఉన్నట్టు అంచనా వేశారు. పర్యావరణ మార్పులు, అటవీ నిర్మూలన వంటివి వర్షాకాలంలో కొండ చరియలు విరిగిపడుతున్న ఘటనలకు ప్రధాన కారణాలని నిపుణులు తెలుపుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలూ విపత్తులకు కారణమని అంచనా వేస్తున్నారు. 2015-22 మధ్య దేశ వ్యాప్తంగా 3 వేల 782 ఘటనలు చోటుచేసుకోగా, వాటిల్లో 2 వేల 239 ఘటనలు అంటే 59.2% ఒక్క కేరళలోనే జరిగాయని తెలిపింది.