UPDATES  

NEWS

 జమ్మూకశ్మీర్ శాంతిభద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమీక్ష..

ఇటీవల ఉగ్రవాద దాడి ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వారం వ్యవధిలోనే నాలుగు ఉగ్రదాడులు జరగ్గా, ఇప్పుడు అమర్ నాథ్ యాత్ర వస్తుండడంతో ఆ మేరకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అమిత్ షా చర్చించారు. ఈ సమావేశం దాదాపు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగింది.

 

టెర్రరిస్టులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉపయోగిస్తున్న సొరంగ మార్గాలను గుర్తించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో స్థానిక నిఘా వ్యవస్థలను బలోపేతం చేయాలని అమిత్ షా సూచించారు. డ్రోన్ చొరబాట్లను కూడా సమర్థంగా ఎదుర్కోవాలని అన్నారు.

 

జీరో టెర్రర్ ప్లాన్ తో కశ్మీర్ లోయలో ఎలా శాంతి నెలకొందో, అదే ప్రణాళికను జమ్మూ ప్రాంతంలోనూ అమలు చేయాలని నిర్దేశించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు మోదీ సర్కారు సరికొత్త మార్గాలను అవలంబిస్తుందని తెలిపారు.

 

జమ్మూకశ్మీర్ లో సైన్యం, పారామిలిటరీ బలగాలు పరస్పర సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని అమిత్ షా స్పష్టం చేశారు. భద్రతా పరంగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదంపై పోరు ప్రస్తుతం నిర్ణయాత్మక దశలో ఉందని, ఈ స్థితిలో ఉదాసీనంగా వ్యవహరించరాదని సూచించారు.

 

ఇటీవలి ఘటనలు పరిశీలిస్తే… ఉగ్రవాద చర్యలు భారీ హింసాత్మక ఘటనల నుంచి చిన్నా చితకా దాడుల స్థాయికి పడిపోయాయని, వీటిని కూడా నిర్మూలించడానికి తాము కృతనిశ్చయంతో ఉన్నామని అమిత్ షా ఉద్ఘాటించారు.

 

ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, భారత్ తదుపరి ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, కేంద్ర నిఘా సంస్థ డైరెక్టర్ తపన్ దేకా, సీఆర్పీఎఫ్ డీజీ అనీశ్ దయాళ్ సింగ్, బీఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్, జమ్మూకశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వైన్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |