ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 19న పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేన పార్టీ కార్యాలయం ఈ విషయాన్ని తాజాగా ప్రకటించింది. డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారు.
జూన్ 12న పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఆయనకు కీలక శాఖలు అప్పగించారు. తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, వెంగలపూడిలోని సచివాలయంలో డిప్యూటీ సీఎం కోసం ఛాంబర్ సిద్ధం చేస్తున్నారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు మంత్రులు ఇప్పటికే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. జూన్ 19న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు పవన్ కళ్యాన్ ప్రకటించడంతో జనసేన వర్గాలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తొలిసారి భారీ మెజార్టీతో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిగా బరిలో దిగారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఏపీ వ్యాప్తంగా మొత్తం 21 స్థానాల్లో బరిలోకి దిగారు. పోటీ చేసిన అన్ని సీట్లలోనూ విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
జూన్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సహా 24 మంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాఖల కేటాయింపుపై ఉత్కంఠే కొనసాగింది. చివరకు ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన జనసేన అధినేత పవన్‌కు కీలక శాఖలు దక్కాయి. జనసేన పార్టీకి చెందిన ఇతర మంత్రులకు కూడా కీలక శాఖలే దక్కాయి. మంత్రి నాదెండ్ల మనోహర్‌కు పౌరసరఫరాలశాఖ, వినియోగదారుల వ్యవహారాలు అప్పగించారు. అలాగే మంత్రి కందుల దుర్గేష్‌కు పర్యాటక, సాంస్క్రతిక, సినిమాటోగ్రఫీ శాఖలు అప్పగించారు.