ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమేనంటూ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రాజకీయ నాయకుడిగా కంటే తనన తాను ఓ ప్రొవైడర్గా ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
ప్రజలకు సేవలను అందించడంతో వారి ఆకాంక్షలను కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ఓ రాజకీయ నాయకుడిపై ఉంటుందని, వైఎస్ జగన్ దాన్ని విస్మరించారని అన్నారు. రోడ్లు, రాజధాని నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి పెట్టట్లేదని, అప్పు తెచ్చయినా ప్రతి నెలా డబ్బులు పంచడానికే ప్రాధాన్యత ఇస్తోన్నారని పేర్కొన్నారు.
నిజానికి- ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిశోర్ వేసిన అంచనాలు ఎలాంటివి?, అవి ఎంత వరకు నిజం అయ్యాయి? ఎక్కడెక్కడ వాస్తవ రూపాన్ని దాల్చాయి? అనే ప్రశ్నలకు వ్యతిరేక ఫలితాలే వెలువడ్డాయి. ప్రశాంత్ కిశోర్ వేసే ఎన్నికల వ్యూహాలు, అంచనాలకు కాలం చెల్లిందనే మాటను నిజం చేశాయి.
దేశంలో 95 శాతం హిందూ జనాభా గల హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 2022లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని అప్పట్లో ప్రశాంత్ కిశోర్ అంచనా వేశారు. దీని ఫలితం మరోలా ఉంది. ఆ ఎన్నికల్లో 60 శాతం మేర మెజారిటీతో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది.
గత ఏడాది కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిశోర్ అంచనాలు ఘోరంగా తప్పాయి. ఇక్కడ మళ్లీ బీజేపీ విజయం అంటూ ఆయన జోస్యం చెప్పగా.. ఫలితం మరోలా వెలువడింది. భారీ మెజారిటీ కాంగ్రెస్ జెండా ఎగురవేసింది కన్నడ గడ్డపై. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ 135 సీట్లతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ 66 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్షంలో కూర్చుంది.
తెలంగాణలోనూ అంతే. అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితి తరఫున పని చేశారు ప్రశాంత్ కిశోర్. బీఆర్ఎస్‌ను గెలిపించడానికి వ్యూహాలు వేశారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ ఏమైంది?. ఫలితం ఎలాంటిదో మనకు తెలిసిందే. కాంగ్రెస్ అధికారాన్ని అందుకుంది.
ప్రశాంత్ కిశోర్ అంచనాలు, జోస్యాలు ఏరకంగా తప్పుతున్నాయనడానికి వీటిని బెస్ట్ ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఎటొచ్చీ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఓడించడం అనేది ఆయన లక్ష్యంగా మారినట్టు కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రశాంత్ కిశోర్ పని చేస్తోన్నాడనే విమర్శలు బాహటంగానే వినిపిస్తోన్నాయి.