UPDATES  

NEWS

 వివేకా హత్య చుట్టూనే ఏపీ రాజకీయాలు..

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద హత్య కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ అంశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకుని గత ఎన్నికల్లో జగన్ లబ్దిపొందారు. తర్వాత అధికారంలోకి రావడం జరిగిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు నడుస్తున్న తీరు అందరికీ తెల్సిందే. సరిగ్గా ఐదేళ్ల తర్వాత అదే అంశం ఫ్యాన్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

 

వివేకా హత్య కేసుపై జగన్ పార్టీ సైలెంట్ అయ్యింది. ఓ వైపు ఫ్యామిలీ సభ్యులు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు టీడీపీ ప్రశ్నిస్తున్నా ఏమాత్రం రిప్లై ఇవ్వకుండా సైలెంట్ అయిపోయారు సీఎం జగన్. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. ఫ్యామిలీ సభ్యులు మాత్రం పదేపదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా జగన్ మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి.

 

కడప జిల్లాలోని మెయిళ్ల కాల్వలో రెండురోజుల కిందట జరిగిన ఎన్నికల ర్యాలీలో రవీంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వివేకానంద హత్యకు సంబంధించిన ఆధారాల్ని గంగిరెడ్డి తుడిచేస్తుంటే.. అక్కడే ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి చూస్తూ నిలబడిపోయారని వ్యాఖ్యానించారు. రవీంద్ర మాటలు విన్న ఎంపీ అవినాష్‌రెడ్డి సైలెంట్‌ అయిపోయారు. దీంతో ఆధారాల ధ్వంసం విషయం తనకు తెలుసని అంగీకరించినట్లైంది.

 

తనకు ఎలాంటి సంబంధం లేకపోతే పోలీసులకు అవినాష్‌రెడ్డి ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నది మొదటి ప్రశ్న. అంటే పక్కాగా ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. హత్య జరిగిన సమయంలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ఎక్కడున్నారు? ఈ విషయం ఆయనకు ఎలా తెలుసు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గంగిరెడ్డి- వివేకానందరెడ్డి సన్నిహితంగా ఉండేవారు. వాళ్ల సన్నిహితం గురించి ఆ కుటుంబసభ్యులే చెబుతారు. ఇంత క్లోజ్‌గా ఉండే గంగిరెడ్డి.. వివేకా హత్యకు సంబంధించిన ఆధారాలు ధ్వంసం చేస్తుంటే అవినాష్ ఎందుకు సైలెంట్‌‌గా ఉన్నారు?

 

వివేకా హత్యకు కుట్ర చేయడమేకాదు.. ఆధారాల ధ్వంసానికి అవినాష్‌రెడ్డి పాల్పడ్డారని సీబీఐ అభియోగా లు నమోదు చేసింది. ఈ లెక్కన సీబీఐ నమోదు చేసిన అభియోగాలు నిజమేనని రవీంద్రనాథ్‌రెడ్డి మాటల ద్వారా తేలతెల్లమైంది. ఈ వ్యవహారంపై వివేకానంద కూతురు సునీత తన పోరాటం కంటిన్యూ చేస్తున్నారు. హంతకులు అధికారంలో ఉంటే సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సీఎం జగన్ కాపాడుతున్నారని పదేపదే సునీత చెబుతున్నారు.

 

వైఎస్ షర్మిల తన బస్సుయాత్రలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. హంతకులు చట్ట సభల్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని, అందుకే కడప నుంచి తాను పోటీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రవీంద్రనాథ్‌రెడ్డి చేసిన కామెంట్స్ ద్వారా అవినాష్‌రెడ్డికి మరిన్ని చిక్కులు తప్పకపోవచ్చని అంటున్నారు కడప జిల్లా వాసులు. కడప జిల్లా రాజకీయాలు మొత్తం వివేకా హత్య చుట్టూనే తిరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత ఈ కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |